పరిచయం
చివరి నిజాం, ఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి, అలనాటి ప్రపంచ కుబెరుల్లో ఒకరు, 1937 సంవత్సరంలో నిజాంను టైమ్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రకటన. కానీ అంతిమ జీవితంలో నిరాడంబరం జీవితం గడిపిన ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII, అని బిరుదుతో పిలువబడిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి స్మృతి దినం !
ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజుల్లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకరు. నిజాం రాష్ట్రాన్నిమొత్తం ఏడుగురు నిజాంలు పాలించినప్పటికీ చివరి నవాబైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవితం మొత్తం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. నిజాం రాష్ట్రం విలీనానికి ముందు దేశంలో దాదాపు 600 సంస్థానాలుండేవి. వీటిలో వైశాల్యం పరంగానూ, ఆర్దికపరంగానూ నిజాం రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆనాటి సమకాలీన రాజుల్లోనూ, సంస్థానాదీశుల్లో ఉస్మాన్ అలీ ఖాన్ ఆధునిక భావాలున్న వారీగా పరిగణించవచ్చు. వీరి కాలంలోనే నిజాం రాష్ట్రంలో విద్య, వైద్య, నీటిపారుదల, పరిపాలనా. శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన తదితర రంగాల్లో అభివృద్ధి, సంస్కరణలు జరిగాయి.. ఆసియా ఖండంలోనే నాడు మేటి రాజ్యాంగ నిజాం రాజ్యం ఉండేది.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిలో నాడు నైజాం ప్రభుత్వం దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పటం లో ఎలాంటి అతియోశక్తి లేదు.. నిజాం రాష్ట్రంలో నాడు సొంత రైల్వే, అంతర్జాతీయంగా సంబంధాలను కలిపే సొంత విమానయానరంగం.. తపాలా, అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో విదేశాంగ ప్రతినిధులు కలిగి నాడు ఐరోపా దేశాలకు దీటుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిజాం రాష్ట్రం ఉండేది.
అయితే.. ఎప్పుడైతే కాశిం రిజ్వి రజాకార్ ఉద్యమానికి నాయకత్వాన్ని చేపట్టాడో అప్పటి నుండి ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటిదాకా చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సేవలు కనుమరుగై పోయి ఆయన ఒక కరుడు గట్టిన మత చాంధస వాదిగా ప్రజల దృష్టిలో మారడం ప్రారంభమైంది. ఇదేసమయంలో, నిజాంను ఒక దుర్మార్గుడిగా, మతమౌఢ్యుడిగా సృష్టించడంలో పరాయి రాష్ట్ర నాయకుల చెప్పుచేతల్లో ఉన్న కొన్ని పార్టీలు విజయం సాధించాయి..
ఇక్కడ నిజాం మంచివాడా, క్రూరుడా, మత చాందస వాడా అనే విషయాలను పక్కనబెడితే, ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. వీటిలో కొన్ని సిల్లీ గా కనిపించినప్పటికీ ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేవిగా ఉన్నాయి..మంచి లావిష్ జీవితాన్ని గడిపిన ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ తర్వాత సాధారణ జీవితాన్ని గడిపాడు. ఒక విధంగా చెప్పాలంటే, 1947 కు ముందు తర్వాత అనేదిగా ఆయన జీవితం ఉంటుంది..
ఉస్మాన్ ఆలీ ఖాన్, మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. సా.శ. 1911లో నిజాం మరణించడంతో ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. ఇతడి పూర్తి పేరు ” ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII”భూమిలేని రైతుల మధ్య తిరిగి పంపిణీ కోసం వినోబా భావే యొక్క భూదాన్ ఉద్యమానికి తన వ్యక్తిగత ఎస్టేట్ నుండి 14,000 ఎకరాల (5,700 హెక్టార్లు) భూమిని విరాళంగా ఇచ్చిన వితరణశీలి.
ఉస్మాన్ ఆలీ ఖాన్, ఏప్రిల్ 6, 1886లో హైదరాబాదులోని పురానీ హవేలీలో జన్మించారు. టైమ్ పత్రిక 1937 సంవత్సరం నిజాంను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా నైజాం ముఖచిత్రాన్ని ప్రచురించింది. నిజాంలకు ఆదాయం ప్రధాన వనరుగా ఉన్న ”’గోల్కొండ గని”’. 19 వ శతాబ్దం, హైదరాబాద్, బేరర్లు ప్రపంచ మార్కెట్లో వజ్రాల ప్రసిద్ధ సరఫరాదారులు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఉస్మాన్ అలీ ఖాన్ కు బహుమానాలు ‘నజర్’ స్వీకరించే అలవాటు ఉండేది. మొగల్ లనుండి వచ్చిన ఈ సంప్రదాయం చివరి నిజాం కాలంలో ఎక్కువైంది. పుట్టిన రోజు, ఈద్ ల సందర్బంగా ఈ నజరాణాలను స్వీకరించేవాడు. ఈ నజర్ ల కోసమై ప్రత్యేకంగా దర్బారులు కూడా నిర్వహించేవారు. నజర్ సమర్పించే వ్యక్తి ముందుకు వచ్చి వంగి నిలబడి, ఒక అరచేతిపై మరో అరచేతిని తెరచి ఉంచి, ఆచేతిపై శుభ్రమైన ఎంబ్రాయిడరీతో ఉన్నవస్త్రంపై అష్రఫీ అని పిలిచే బంగారు నాణాన్ని, నాలుగు రూపాయలను పెట్టి నిజాంకు సమర్పిస్తారు. నజర్ సమర్పించే వ్యక్తి హోదాను బట్టి ఈ మొత్తం ఉంటుంది. ఈ నజర్ లను స్వీకరించేందుకై తన కుర్చీకి ఇరువైపులా ఉంచిన సంచుల్లో ఒకదానిలో బంగారు నాణాలు, మరో వైపు సంచిలో రూపాయి నాణాలు వేసేవాడు. తనను చూడడానికి వచ్చే అమీరులు, అధికారులు నుండి నజర్ లను ఆశించేవాడు. అయితే, ఈ నజర్ లను స్వీకరించే పద్దతిని మానుకోవాలని రెసిడెంట్ లేఖ రాశారు. దీనితో, నజర్ లను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
జమిందార్లు, చిన్న గడీదారులు, దొరలు నిజాం నవాబుకు కప్పం చెలించిన కప్పం ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నో కట్టడాలు నిజాం నవాబులు నిర్మించారు.
నిర్మించిన సరస్సులు
మూసీ వరద తరువాత, శాశ్వతంగా వరదను నివారించడానికి, నిజాం రెండు సరస్సులు
- ఉస్మాన్ సాగర్,
- హిమాయత్ సాగర్ నిర్మించారు.
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు. నిజాంతో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం చివరకు సెప్టెంబరు 13, 1948న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కూడా కోల్పోయారు.
సరోజినీ నాయుడు కి నిజాం కుటుంబంతో సన్నిహిత మిత్రుత్వం ఉంది. ఒకసారి, సరోజినీ నాయుడితో…నాకు, మా నాన్నగారైన మీరు మహబూబ్ అలీ ఖాన్ కు తేడా ఏమిటని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రశ్నించారు. దీనితో, ‘ఘనత వహించిన మీ తండ్రి గారికి హృదయం ఉంది. మీకు మేధస్సు ఉంది’ అని తడుముకోకుండా సమాధాన మిచ్చిందట సరోజినీ నాయుడు. ఆ సమాదానానికి ఉస్మాన్ అలీఖాన్ గట్టిగా నవ్వాడట..
దేశానికి విరాళాలు…
1965 లో భారత చైనా ల మధ్య ఏర్పడ్డ యుద్ధం సందర్బంగా తనకు నెలకు వచ్చే కోటి రూపాయల ఆదాయంలో మూడవ వంతు అంటే, 75 లక్షల రూపాయల విలువైన విరాళాన్నిభారత ప్రభుత్వానికి ప్రకటించారు. 5 వేల కిలోల బంగారాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్ విలువ లో దాదాపు రెండు వేలకోట్ల రూపాయాల విలువ ఉండే ఈ బంగారాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప బాక్సులలో న్యూ ఢిల్లీ కి పంపారు. అయితే, న్యూఢిల్లీ కి పంపినది కేవలం బంగారమే కాని అవి ఉన్న ఇనుప బాక్సులు తిరిగి వాపసు చేయాలని కోరడం విచిత్రంగా మాత్రం విచిత్రం.
ఆలయం విరాళాలు….
నిజాం హిందువులు, ముస్లింలను తన రెండు కళ్ళుగా భావించారు. అతను అనేక దేవాలయాల పురోగతి కోసం అనేక సార్లు బంగారు, డబ్బుని విరాళంగా ఇచ్చాడు.
నిజాం రాష్ట్ర రికార్డును పరిశీలిస్తే, మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు 82,825 రూపాయలను యాదగిరి నరసింహ స్వామీ, యాదగిరి గుట్ట ఆలయానికి, 50,000 రూపాయల భద్రాచలం రాముని ఆలయానికి, 80 వేల రూపాయలకు తిరుపతి వెంకటేశ్వర ఆలయానికి విరాళాలు ఇచ్చారు.
మహాభారత సంకలనం కొరకు విరాళం…
1932 సంవత్సరంలో, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (పూణే), హిందూ “మహాభారతం” సంకలనం, ప్రచురణకు డబ్బు అవసరం అభ్యర్దనకు 11 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి రూ .1000 విడుదల చేశారు.
ఆ తరువాత “మీర్ ఉస్మాన్ అలీ ఖాన్”గారికి ఇనిస్టిట్యూట్ అధికారిక అభ్యర్థనకు మేర అక్కడ ఉన్న అదితి గృహానికి రూ. “నిజాం గెస్ట్ హౌస్”గా పిలువబడే భవన నిర్మాణానికి కూడా 50,000 రూపాయల సహకారం అందించారు.
హైదరాబాదులో స్టేట్ లో చేపట్టిన అభివృద్ధి పనులు…
- నిజాం సాగర్ సరసు నిర్మించబడినది
- ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918 వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటి. ప్రాథమిక విద్య తప్పనిసరి చేసింది, పేదలకు ఉచితంగా విద్య అందించారు.
- సిర్పూరు పేపరు మిల్స్
- బోధన్ చక్కెర ఫాక్టరీ
- అజంజాహీ నూలు మిల్లులు
- చార్మినార్ సిగరెట్ ఫాక్టరీ కర్మాగారాలు
- నిజాం స్టేట్ రైల్వే నెలకొల్పబడింది
- 1911లో సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డుగా పిలువబడే బోర్డును ఏర్పాటుచేశాడు.
- 1960లో తెలంగాణ హౌజింగ్ బోర్డుగా మార్చబడింది.
ప్రసిద్ధ నిర్మాణాలు…
- చిరాన్ ప్యాలెస్: హైదరాబాదులోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంలో ఉన్న ప్యాలెస్. 1940లో నిర్మించబడిన చిరాన్ ప్యాలెస్, 400 ఎకరాల్లో విస్తరించి ఉంది.
- తెలంగాణ హైకోర్టు: 1920, ఏప్రిల్ 20న తెలంగాణ హైకోర్టు ప్రారంభించబడింది.
- రాజ్‌భవన్: హైదరాబాదులోని సోమాజీగూడ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనం ఈ రాజ్‌భవన్. ఇది రాష్ట్ర గవర్నరు అధికారిక నివాసంగా ఉపయోగపడుతుంది.
- ఆజా ఖానా ఎ జెహ్రా: మూసీ నది తీరంలో ఆజా ఖానా ఎ జెహ్రా అనే ప్రార్థన మందిరం ఉంది.
- నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్): హైదరాబాదులోని పంజగుట్టలో 1961లో నిర్మించిన ఆసుపత్రి.
- ఆజం జాహి మిల్స్: వరంగల్ జిల్లాలో స్థాపించబడిన వస్త్ర తయారీ సంస్థ.
- నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్: హైదరాబాదులో ఉన్న ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్.
మరణం , అంత్యక్రియలు….
80 ఏళ్ల పది నెలల 22 రోజుల వయస్సులో 1967 ఫిబ్రవరి 24 న కింగ్ కోఠి ప్యాలెస్లో మరణించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంతిమ యాత్ర లో రికార్డు స్థాయిలో దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్నారు. ఉస్మాన్ అలీ ఖాన్ భౌతిక కాయాన్ని కింగ్ కోఠి లోని జుడి మస్జీద్ లోని తన ప్రియ మాతృమూర్తి, తన కుమారుడు జువాద్ సమాధుల పక్కన ఖననం చేశారు.