నిషేధిత సంస్థ సిక్క్ ఫర్ జస్టిస్ (SFJ) అధినేత, ఖలిస్తాన్ తీవ్రవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం కలుగుతుందని, నవంబరు 19న ఇందిరాగాంధీ విమానాశ్రయాన్ని మూసివేస్తామని భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వీడియోని జారీ చేశాడు.
వీడియోలో పన్నూన్ “ఎయిర్ ఇండియాలో ప్రయాణించకుండా ఉండమని మేము సిక్కు సమాజాన్ని కోరుతున్నాం. నవంబర్ 19న ప్రపంచవ్యాప్త దిగ్బంధనంలో భాగంగా, మేము ఎయిర్ ఇండియాను ఆపరేట్ చేయడానికి అనుమతించం. మేం నవంబర్ 19 నుండి ఎయిర్ ఇండియా సేవలను ఉపయోగించవద్దని సిక్కు కమ్యూనిటీ సభ్యులందరికీ సలహా ఇస్తున్నాం. లేదంటే మీ ప్రాణాలకు ప్రమాదం కలగవచ్చు” అని ఆ వీడియోలో హెచ్చరించారు.
ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు పన్నూన్ హెచ్చరించాడు. “ఈ నవంబర్ 19న ప్రపంచ టెర్రర్ కప్ ఫైనల్‌తో సమానంగా ఉంటుంది” అని పన్నన్ తెలిపాడు. “ఆ రోజున, సిక్కు సమాజంపై భారతదేశం అణచివేతకు ప్రపంచం సాక్ష్యమిస్తుంది. పంజాబ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత విమానాశ్రయం పేరు షాహిద్ బియాంత్ సింగ్, షాహిద్ సత్వంత్ సింగ్ ఖలిస్తాన్ విమానాశ్రయంగా మార్చబడుతుంది” అన్నారాయన. ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణతో పంజాబ్ స్వాతంత్ర్యం కోసం పోరాటం ఇప్పటికే ప్రారంభమైందని, భారత ట్యాంకులు, ఫిరంగిదళాలు దాని సాకారాన్ని నిరోధించలేవని పన్నన్ నొక్కిచెప్పారు.