Site icon Telangana Voice News

ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు

పహల్గామ్​ దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​ లో పాక్​ లోని పౌర సమాజానికి నష్టం వాటిల్లకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని డైరెక్టర్​ జనరల్​ మిలిటరీ ఆపరేషన్స్​ (డీజీఎంవో) లెఫ్ట్​ నెంట్​ జనరల్​ రాజీవ్​ ఘాయ్​ తెలిపారు. అదే సమయంలో పాక్​ సరిహద్దులోని భారత పౌరులను, దేవాలయాలను, ప్రార్థనాలయాలను టార్గెట్​ చేసుకుందని చెప్పారు. తాము యుద్ధనీతిని ప్రదర్శించామని, పాక్​ ఈ నీతిని విస్మరించిందన్నారు. దీంతో పాక్​ లోని నాలుగు ఎయిర్​ బేస్​ లను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. రాడార్​ వ్యవస్థలను నేలకూల్చామన్నారు. 

ఆదివారం సాయంత్రం ఆపరేషన్ సింధూర్, పాక్​ చేస్తున్న ఆరోపణలపై డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, భారత వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ (డీజీ ఎయిర్ ఆప్స్) ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి, భారత నేవీ డైరెక్టర్ జనరల్ నావల్ ఆపరేషన్స్ (డీజీఎన్​ వో), వైస్ అడ్మిరల్ ప్రమోద్ లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత నుంచి జరిగిన పరిణామాలను బయటపెట్టారు. పాక్​ ఆరోపణలను ఆధారాలతో సహా చూపెడుతూ తిప్పికొట్టారు. 

ఆపరేషన్​ సిందూర్​ లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు మృతిచెందగా, వందమందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందారని చెప్పారు. అదే సమయంలో సరిహద్దు కాల్పుల ఉల్లంఘన నేపథ్యంలో భారత్​ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో 35నుంచి 45 మంది పాక్​ జవాన్లు హతమయ్యారని సమాచారం ఉందన్నారు. అదే సమయంలో భారత్​ కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారని చెప్పారు. ఇప్పటికీ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయన్నారు. భారత్​ గట్టి నిఘా కొనసాగిస్తుందని చెప్పారు. కాల్పుల విరమణ ప్రకటించాక పాక్​ ఉల్లంఘటనలను వివరించారు. వీటిని అడ్డుకున్న తీరును చెప్పారు. డ్రోన్ల కూల్చివేతలను ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో బలమైన ప్రతిస్పందన ఇవ్వాలని తమకు ఆదేశాలందాయన్నారు. పాక్​ ప్రధాని షాబాజ్​ పహల్గామ్​ దాడిలో ఉగ్రహస్తాన్ని అంగీకరించకుండా భారత్​ తో రెచ్చగొట్టే ధోరణికి పాల్పడ్డారని, చైనా పేరు చెప్పి తమను భయపెట్టేందుకు చూశారని అన్నారు. 

బహవల్పూర్, మురిడ్కే ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. ఈ నేపథ్యంలో భారత్​ సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్​ చేసిన ప్రయత్నాలను కూడా తిప్పికొట్టామని అధికారులు వివరించారు. భారత రక్షణ వ్యవస్థ సకాలంలో పాక్​ దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొట్టిందన్నారు. భారత్​ వైమానిక దళం కేవలం ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకుందన్నారు. ఉగ్రశిబిరాలు అంతర్జాతీయ సరిహద్దులోపల ఉన్నాయని అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు.  9 ఉగ్రవాద శిబిరాలను ఈ దాడుల్లో ధ్వంసం చేశామని చెప్పారు. 

పహల్గామ్ దాడి తర్వాత అరేబియా సముద్రంలో భారత్​ నేవీ అనేక విన్యాసాలు నిర్వహించి ఆయుధాల పనితీరును మెరుగుపరుచుకుందని తెలిపారు. పాకిస్తాన్ నావికాదళాన్ని కూడా నిరంతరం పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. చివరగా పాక్​ లో ఉన్న ప్రతీ వ్యవస్థను నాశనం చేసే శక్తి భారత సైన్యానికి ఉందన్నది తెలుసుకోవాలని డీజీఎంఓ ఘాయ్​ వివరించారు. 

Exit mobile version