Site icon Telangana Voice News

జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా..!

Addanki Dayakar - Telangana Voice News

జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా! , అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. రాజకీయ విశ్లేషణలు,అత్యంత (అనధికార )విశ్వసనీయ సమాచారం మేరక ఇలా…ఇటీవల పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పర్యటన సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్దిగా AICC నాయకులు వంశీచందర్ రెడ్డి గారి పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి నిలిపే అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం నుండి అనుకున్న స్థాయిలో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించి తమ ప్రతిస్టతను కాంగ్రెస్ పార్టీ వద్ద మరింత పెంచుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉందట…..అందులో భాగంగానే పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఎంత మంది దరఖాస్తు చేసుకున్న తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వివిధ వర్గాలు ఇచ్చే నివేదికల ఆధారంగా గెలుపు గుర్రాలు ఎవరో ఒక అంచనాకు వచ్చేస్తున్నారట!. ..అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐతే తొమ్మిది సంవత్సరాలుగా ప్రతి పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టికి తన వాగ్దాటితో బలాన్ని నింపడమే కాకుండా, అధికార పక్ష పార్టీల తప్పులను ఎత్తి చూపిన కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడైన అద్దంకి దయాకర్ కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పదవులు వచ్చినట్టే వచ్చి చేజారుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. …

అద్దంకి దయాకర్ కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కుటుంబాలలో, సాధారణ సమాజంలో తన వాగ్దాటితో తన వ్యక్తిగత ఇమేజ్ సంపాదించుకున్నాడు అనేది వాస్తవం. శాసన సభ ఎన్నికల సందర్భంలో తనకు టికెట్ రాకున్నా తాను పార్టీకి విదేయుడనని అతను చేసిన ప్రకటన అన్ని రాజకీయ పార్టీలలో కూడ తీవ్ర చర్చగా మారింది.. ..అంతే కాకుండా MLC పదవి వచ్చినట్టే వచ్చి చేజారాడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో, పౌర సమాజంలో ఆయనపై సానుభూతి అమాంతం పెరిగింది..

అద్దంకి దయాకర్ విషయంలో ఏఐసీసీ వర్గాలు చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది.. అంతే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో కీలకంగా పని చేసిన దళిత నాయకుడైన అద్దంకి దయాకర్ విషయంలో పార్టీ నిర్లక్ష్యం వహిస్తే అవి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆ అంశాలు రాబోవు కాలంలో ప్రతిపక్షాలకు అస్త్రాలవుతాయని భావిస్తున్నట్లుగా తెలిసింది.. రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ఆయన పట్ల ఉన్న సానుభూతి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈసారి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా దింపే ఆలోచన చేస్తున్నట్లుగా అనధికారికంగా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, అధిష్టానం కూడా ఈ రాష్ట్రం నుండి పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు విషయంలో ఒక అంచనాలతో ఉండడంతో పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక విషయంలో గెలుపు గుర్రాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది…. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు తప్ప అన్ని వర్గాల్లో పేరు సంపాదించుకున్న అద్దంకి దయాకర్ అయితే వరంగల్ పార్లమెంటు నుండి సునాయాసంగా విజయం సాధించవచ్చు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా అత్యంత విశ్వసినీయ వర్గాల ద్వారా తెలిసింది.

Exit mobile version