పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి సీతక్కలు మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను వారు దర్శించుకున్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని సమాచార, రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్కలు అన్నారు.
అనంతరం ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందన్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ కొలువైన రాష్ట్రంగా ఉండడం మనందరికీ గర్వకారణంమన్నారు.
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ మహా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. తల్లుల దర్శనానికి మునుపెన్నడు లేనివిధంగా భక్తులకు సకల సదుపాయాలను కల్పించామన్నారు. గత ప్రభుత్వాలు కేవలం తాత్కాలిక నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తే, మా ప్రజా ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు.
గత ప్రభుత్వాలు 2022లో 75 కోట్లు మాత్రమే విడుదల చేస్తే, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే 75 కోట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విడుదల చేసారన్నారు. అదనంగా మరో 35 కోట్లకు కూడా ప్రతిపాదనలను ఆమోదించడం జరిగిందన్నారు. మొత్తంగా జాతర నిర్వహణకు 105 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు.
జాతర కోసం చేపట్టిన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేశామని, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తుల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాకు వీఐపీ నే అని అన్నారు.
తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. జాతరలో ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రద్దీ ప్రాంతాల్లో పెయింటింగ్స్ వేయడంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు స్పష్టం చేశారు.
జాతరలో పారిశుద్ధ్య నిర్వహణకు 4000 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందించనున్నారన్నారు. జాతరలో చెత్తాచెదారం తరలింపు, వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో 14 క్లస్టర్లలో 279 యూనిట్ల ద్వారా 5532 టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు.
కొత్తగా 230 బోర్ వెల్స్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జంపన్న వాగు లోతట్టు ప్రాంతాల్లో, రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల గజ ఈతగాళ్లను నియమించినట్లు తెలిపారు.
జంపన్న వాగులో మోకాలు లోతులో నీళ్లు ఉండే విధంగా ఈ నెల 14న లక్నవరం నీటిని రిలీజ్ చేయడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 30 స్పెషల్ హెల్త్ క్యాంపులను, ఆరు అంబులెన్స్లను అందుబాటులో ఉంచామన్నారు.
గతంలో కంటే రెట్టింపు విధంగా ఆర్టీసీ బస్సులు జాతరకు నడవనున్నట్లు తెలిపారు. ఈ మహా జాతరకు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా 6వేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే పోలీస్ శాఖ నుంచి 14,000 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
వనదేవతలను తీసుకువచ్చే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అప్పుడు రోప్ పార్టీ ద్వారా క్రౌడును కంట్రోల్ చేయడానికి స్పెషల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు వివరించారు.
జాతరలో 500 సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం భద్రత పర్యవేక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశా తెలిపారు.
విఐపి, వివిఐపిల దర్శనం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహా జాతర వన్ వే రూట్లు, పార్కింగ్ స్థలాలను తెలిపే మొబైల్ యాప్ ను ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేశామని తెలిపారు.