బీఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద పోచారం పట్టణంలో ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు వెళుతుండగా, ఘట్ కేసర్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ శక్తిగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి హామీలు ఉల్లంఘించిన ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, కాచవానిసింగారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ కాచవానిసింగారం మాజీ సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు తనను గౌరవిస్తున్నారని, ప్రజాదరణ కోల్పోయిన పార్టీలతో ఇమడలేక బీఆర్ఎస్ లో చేరుతున్నానని వెంకట్ రెడ్డి అన్నారు.