Site icon Telangana Voice News

అతడే ఓ యూనివర్శిటీ… ఫెదరర్!

పరిచయం

ప్రపంచాన్ని జయించడమెలా? మనిషిని అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నీడలా వెంటాడతున్న ‘ప్రశ్న’ ఇది. అలెగ్జాండర్ ది గ్రేట్, చెంఘిజ్ ఖాన్ లాంటి చక్రవర్తులు ‘ఖడ్గం’ చేతపట్టి ప్రపంచాన్ని జయించాలని బయలుదేరారు. గ్రేట్ బ్రిటన్, నాజీ జర్మనీ లాంటి దేశాలు ‘సైన్యం’ దన్నుతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నించాయి.

ఎందరో తత్వవేత్తలు తమ ‘ఫిలాసఫీ’ ద్వారా ప్రపంచాన్ని ఏకం చేసే ప్రయత్నం చేశారు. మరెందరో శాస్త్రవేత్తలు తమ ‘ఆవిష్కరణల’ ద్వారా ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇంకెందరో ‘సేవ’ ద్వారా, ‘కళల’ ద్వారా, ‘క్రీడల’ ద్వారా మరెన్నో మార్గాల ద్వారా ప్రపంచాన్ని గెలిచే ప్రయత్నం చేశారు.

ఇదే కోవలో ప్రపంచంలో ఓ మూలన, ఏడేళ్ల బాలుడు టెన్నిస్ ‘రాకెట్’ చేత పట్టుకుని బయలుదేరాడు. తీరా, మూడు దశాబ్దాలు గడిచేసరికి, తన ‘క్రీడా కౌశలం’తో దేశాల ఎల్లల్ని చేరిపేసి అందరి హృదయాల్ని కొల్లగొట్టేశాడు. తద్వారా ప్రపంచాన్నే జయించేశాడు. అతడే టెన్నిస్ దిగ్గజం – రోజర్ ఫెదరర్!

అడవుల్లో వేటతో మొదలైంది మనిషి మహాప్రస్థానం. ఆపై నిప్పును రాజేసి, చక్రాన్ని తిప్పి, పొలాల్ని పండించి, ఫ్యాక్టరీలను స్థాపించి, నగరాలను, నాగరికతను నిర్మించి, సైన్సును, కళల్ని, క్రీడల్ని కనిపెట్టి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాడు. ఇక, అప్పుడెప్పుడో మొరటుగా మొదలైన మల్లయుద్ధాలు, గ్లాడియేటర్ పోరాటాల దగ్గర్నుండి నేటి మహోజ్వల ఒలింపిక్స్ దాకా క్రీడా ప్రస్థానం శాఖోపశాఖలై విస్తరించింది.

ఒక్కసారి ప్రపంచ క్రీడా ప్రస్థానపు చరిత్ర పుటల్ని తిరగేస్తే జెస్సీ ఒవెన్స్, ధ్యాన్ చంద్, మహమ్మద్ అలీ, డాన్ బ్రాడ్ మన్, పీలే, మారడోనా, నదియా కమనేసి, రాడ్ లేవర్, మార్టినా నవ్రతిలోవా, స్టెఫీ గ్రాఫ్, షూమాకర్, టైగర్ ఉడ్స్, లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకేల్ ఫెల్ప్స్, ఉసేన్ బోల్ట్, పీట్ సంప్రాస్, మెస్సీ, సచిన్ టెండూల్కర్, ఫెదరర్ ఇలా ఎందరో మహామహులు కనిపిస్తారు.

ఈ మేటి క్రీడాకారులందరిలో శిఖరాగ్రాన నిలిచే క్రీడా యోధుడు ఎవరు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా నిర్వహించిన అనేకానేక మేధోమధనాల్లో, సర్వేల్లో మెజారిటీ క్రీడాప్రేమికులు ‘ఫెదరర్’ కే అగ్రతాంబూలమిచ్చి తమ హృదయాల్లో గుడి కట్టారు. అసలింతకీ ఏ నైపుణ్యాలు, ఏయే గుణగణాలు… ఫెదరర్ ని ‘గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్’ గా నిలబెట్టాయో ఓసారి పరిశీలిద్దాం.

సైంటిస్టు + ఆర్టిస్టు :

ఎందులోనైనా కొత్తదాన్ని ఆవిష్కరించాలంటే ‘సైన్సు’ అవసరం. ఆ ఆవిష్కరణను సౌందర్యవంతంగా ఆచరణలో పెట్టాలంటే దానికి ‘ఆర్టు’ అవసరం. ఈ రకంగా చూస్తే, టెన్నిస్ నే వృత్తిగా, ప్రవృత్తిగా, ప్రాణప్రదంగా భావించే ఫెదరర్, ఆ క్రీడలో కనిపెట్టిన విభిన్నమైన, వినూత్నమైన షాట్లకు లెక్కే లేదు. ఇక ఫెదరర్ ఆటశైలి కూడా… ఒక శిల్పి- శిలకు ప్రాణం పోస్టున్నట్టుగా ఉంటుంది. అతడు సర్వీస్ చేస్తే బంతి శ్రీహరికోట రాకెట్ లా దూసుకెళుతుంది. అతడు రిటర్న్ షాట్ ఆడితే న్యూటన్ మూడో సూత్రం అప్లయ్ అవుతుంది. అతడు డ్రాప్ షాట్ ఆడితే బంతి సూఫీ నృత్యం చేస్తూ నేలను ముద్దాడుతుంది. అతడు స్మాష్ కొడితే బంతి స్పార్టన్ యోధుడు విసిరిన బల్లెంలా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అతడు ర్యాలీ ఆడితే పట్టువదలని విక్రమార్కుడు అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే టెన్నిస్ ను సైంటిఫిగ్గా, సౌందర్యవంతంగా ఆడే ఇంద్రజాలికుడిలా కనిపిస్తాడు ఫెదరర్.

మిలిటరీ కమాండర్:

సాధారణంగా యుద్ధ సమయాల్లో ఎదురు దాడికి దిగి ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టడం, అవసరమైతే వెనక్కి తగ్గి అదును చూసి దెబ్బకొట్టడం అనే రెండు వ్యూహాలూ ఉంటాయి. ఈ యుద్ధ కళను టెన్నిస్ రణరంగంలో అత్యంత పకడ్బందీగా అమలు చేయడంలో ఫెదరర్ సిద్ధహస్తుడు. స్వతసిద్ధంగా ఫెదరర్ ఎక్కువగా ఎదురుదాడినే ఇష్టపడతాడు. యుద్ధంలో శత్రువును బెంబేలెత్తించడంలో ‘బ్లిట్జ్ క్రీగ్’ పద్ధతి ఉన్నట్టు; టెన్నిస్ లో ప్రత్యర్థిని బిత్తరపోయేలా చేసేందుకుగాను ఫెదరర్ ‘స్నీక్ అటాక్’ ను కనిపెట్టాడు. కొన్నిసార్లు అవసరమైతే బ్యాక్ హ్యాండ్ సాయంతో ర్యాలీలు ఆడి, ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి విరుచుకుపడడంలో కూడా ఫెదరర్ దిట్ట.

స్థితప్రజ్ఞుడు:

టెన్నిస్ లో ఫెదరర్ ఆడని షాట్ లేదు. గెలవని ట్రోఫీ లేదు. అధిరోహించని శిఖరం లేదు. ఆర్జించని పేరు, హోదా లేవు. అయినా ఏనాడు అహంభావాన్ని, గర్వాన్ని తలకెక్కించుకోలేదు. ఎప్పుడూ వినమ్రంగానే ఒదిగున్నాడు. హుందాతనాన్నే ఆభరణంగా ధరించాడు. ఇదే ఫెదరర్ గాయాల పాలయ్యాడు. అనామకుల చేతిలో ఓటమి పాలయ్యాడు. పాతాళానికి పడిపోయాడు. విమర్శల శరపరంపరను ఎదుర్కొన్నాడు. అయినా సరే ఏనాడూ కుంగిపోలేదు. నిరాశా నిస్పృహల ఊబిలో కూరుకుపోలేదు. ఎప్పుడూ పడ్డచోటే పైకి లేచాడు. ఫీనిక్స్ లా ప్రాణం పోసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కెరీర్ – కుటుంబం అనే రెండు పడవల ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేయొచ్చో చూపి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఫెదరర్.

అజాత శత్రువు:

భారతంలో ధర్మరాజు అజాత శత్రువుగా కనిపిస్తాడు. ఫెదరర్ కూడా అదే కేటగిరి. ఫెదరర్ తన కెరీర్ లో దాదాపు మూడు తరాల ఆటగాళ్లతో తలపడ్డాడు. మొన్న సంప్రాస్, ఆగస్సీ లాంటి ఆటగాళ్లతో; నిన్న నాదల్, జకోవిచ్, ముర్రె లాంటి ఆటగాళ్లతో; నేడు జ్వెరెవ్, దిమిత్రొవ్, కిర్గియోస్ లాంటి ఆటగాళ్లతో ఆడాడు. ఫెదరర్ ఎప్పుడూ ప్రత్యర్థిని ఓడించాలని ఆడడం కంటే కూడా, ఆటలో మజాను ఆస్వాదించడాన్నే ఎక్కువగా ఇష్టపడతాడు. గెలుపులో హుందాగా ప్రవర్తిస్తాడు. ఓటమిని వినమ్రంగా స్వీకరిస్తాడు. ప్రత్యర్థి బలాల్ని ప్రశంసించడంలో ఏమాత్రం వెనుకాడడు. అందుకే నాదల్ లాంటి ఆటగాళ్లు సైతం – ‘మేము అప్పుడప్పుడూ విజేతలుగా నిలుస్తాం, నువ్వు ఎల్లప్పటికీ ఛాంపియన్ వే’ అంటూ ఫెదరర్ గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించినవాళ్లే. టెన్నిస్ లో ఫెదరర్ ను ఇష్టపడని, గౌరవించని ఆటగాడంటూ లేడంటే అతిశయోక్తి కాదేమో.

ప్రపంచ మానవుడు:

జాతులు, దేశాల మధ్య ఎల్లల్ని చెరిపేసి సౌహార్ద్రతను, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడంలో కళలు, క్రీడలకు మించిన ఉపకరణాలు లేవు. దేశదేశాల క్రీడల్ని ఎన్నింటినో గుర్తించి, వాటికి సముచిత ప్రాధాన్యానిచ్చి, ఒక్క వేదికపైకి తెచ్చి ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ పండగలు నిర్వహించడం మొదలెట్టాక క్రీడాకారులు అంతర్జాతీయ అంబాసిడర్లుగా కొత్త అవతారమెత్తారు. ఒలింపిక్స్ లో అయినా, ఏ పెద్ద క్రీడా సంరంభంలోనైనా ఏ అభిమాని అయినా తమ దేశ క్రీడాకారులే గెలవాలని కోరుకుంటారు. ఫెదరర్ విషయంలో మాత్రం ఇది మినహాయింపు. అది ఆస్ట్రేలియన్ ఓపెన్ కాచవ్చు, లేదా ఫ్రెంచ్ మట్టి కావచ్చు, లేదంటే యూఎస్ టర్ఫ్ కావచ్చు అది కాదంటే వింబుల్డన్ పచ్చిక కావచ్చు, దేశమేదైనా, కోర్టు ఏదైనా ప్రతీ దేశాభిమానీ తమ ప్రాంతీయాభిమానానికి అతీతంగా ఫెదరర్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఫెదరర్ స్థాయిలో ప్రపంచ అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టిన క్రీడాకారుడు ఇంకొకరు లేరేమో. అందుకే ఫెదరర్ అంతర్జాతీయ మానవుడు.

మచ్చలేని మనిషి:

గెలుపు, విజయం, జయకేతనం… పదం ఏదైనా కావచ్చు. గెలుపనేది డబ్బును, అవార్డుల్ని, పేరు ప్రఖ్యాతుల్ని, హోదాన్ని, అభిమానాన్ని ఇలా ఎన్నింటినో కుప్పలుతెప్పలుగా తెచ్చి తలపై గుమ్మరిస్తుంది. గెలుపే ఓ జీవనశైలిగా మారిన సమయంలో హుందాగా మెలిగినవాడు శిఖరాగ్రంపై నిలబడతాడు. అలాకాక విజయ గర్వాన్ని తలకెక్కించుకున్నా, ఆ మత్తులో మునిగినవాడు అధ:పాతాళానికి పడిపోతాడు. క్రీడల్లో శిఖరాగ్రాన్ని అధిరోహించి, ఏదో ఓ బలహీనతతో పతనావస్థను చవిచూసిన మేటి క్రీడాకారులెందరో. మరియానా జోన్స్, లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్, టైగర్ వుడ్స్, మైక్ టైసన్, మరియా షరపోవా, ఆస్కార్ పిస్టోరియస్, ఇలా ఎందరో గెలుపు తెచ్చిపెట్టిన మత్తులో, బలహీనతలో పతనపు అంచులను చవిచూశారు. టెన్నిస్ కు పర్యాయపదంగా మారిన ఫెదరర్… అగ్రస్థానం, అవార్డులు, ఆర్జనలు, పేరు ప్రతిష్టలు ఇలాంటివాటిని లెక్కలేనన్ని మూటగట్టుకున్నా ఏనాడూ ఏ తప్పూ చేయలేదు, ఏ బలహీనతకూ లోనుకాలేదు, ఏ మత్తుకూ బానిస అవలేదు. డ్రగ్స్, ఫిక్సింగ్, వ్యాపారం లాంటి జాఢ్యాలు వైరస్ లా ఎల్లెడలా విస్తరించి క్రీడల జవసత్వాల్ని పీల్చిపిప్పి చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఫెదరర్ లాంటి నిఖార్సైన వ్యక్తిత్వం కల్గిన ఆటగాళ్ల ఆవశ్యకత క్రీడాజగత్తుకు ఎంతైనా ఉంది.

శిబి చక్రవర్తి:

‘నేను అనుభవిస్తున్న ప్రతీ సౌకర్యం వెనక అసంఖ్యాక ప్రజల శ్రమ దాగి ఉంది. నేను ఈనాడు ఈస్థాయిలో ఉన్నానంటే కేవలం నా మునుపటి తరాల భుజాల మీద నిల్చున్నా కాబట్టే అది సాధ్యమవుతోంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ఈ సమాజానికి నావంతుగా సాయం చేస్తేనే నా జీవితానికి సార్థకత లభించినట్టు’ – అని అంటాడు విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్. ఇది అందరికీ వర్తిస్తుంది. ఆటలో, ఆర్జనలో మేటిగా నిలవడంతోనే తన పాత్ర ముగిసినట్టు ఏనాడు భావించలేదు ఫెదరర్. పిల్లల హక్కులు, చదువు, పేదరికం, క్యాన్సర్, ఎయిడ్స్, ప్రకృతి విపత్తులు, శాంతి, శరణార్థులు… ఇలా ఎన్నో రంగాల్లో అభాగ్యుల సహాయార్థం ఎన్నో ఛారిటీ మ్యాచులు ఆడాడు ఫెదరర్. ఆపై ఫెదరర్ ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టి స్విజర్లాండ్, ఆఫ్రికాలోని పేద పిల్లల విద్యా వికాసం కోసం గత పదిహేనేళ్లుగా అవిరళ కృషి చేస్తున్నాడు.

అతడే ఓ యూనివర్శిటీ:

ఓ మనిషి తన వృత్తినే ప్రవృత్తిగా మలచుకుని ప్రాణప్రదంగా ప్రేమించి శ్రమిస్తే హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతారనడానికి చరిత్రలో ఉదంతాలు కోకొల్లలు. అలాంటి గొప్ప ఉదంతాల్లో ఫెదరర్ జీవితం కూడా ఓ మచ్చు తునకే. అత్యధిక గ్రాండ్ స్లామ్స్, అత్యధిక కాలం నెంబర్ వన్, అత్యధిక అవార్డులు, అత్యంత స్థితప్రజ్ఞత, ఆటలో అత్యంత కళాత్మకత, అత్యంత దాతృత్వం, అత్యంత ఫిట్ నెస్, అత్యధిక ప్రపంచ ప్రజల ప్రేమాభిమానం… ఇలా ఏ దిశలో చూసినా ఫెదరర్ జీవితం ఆదర్శప్రాయమే, ఆచరణీయమే. ఫెదరర్ లోని ఈ యూనివర్శల్ గుణగణాలే… అసంఖ్యాక క్రీడాభిమానులకు ఆరాధ్యదైవంగా, ఎందరో క్రీడాకారులకు హీరోగా, మరెన్నో సంస్థలకు ఐకన్ గా నిలిపాయి. అందుకే ఫెదరర్… ఓ యూనివర్శిటీ!

Exit mobile version