మీ కార్యకర్తల మనసు మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని ఎవరు తప్పు దారి పట్టిస్తున్నారు?
ఎంతో మంది జనసైనుకుల మనసు నొప్పిస్తాను అని తెలిసి కూడా , నా ఆవేదనని పబ్లిక్ గ పంచుకోవాలి అనిపించింది అన్న. జనసేన పార్టీని, దాని ఆత్మని, భావోద్యోగాన్ని ICU లో స్లో డెత్ బెడ్లొ పడుకో పెట్టాశారు అని నా ఆక్రోశం ముందు నా తోటి జనసైనుకుల ఆగ్రహం చిన్నది అనిపించింది అన్న. నన్ను మన్నించు అన్న, నేను ఏమైనా అవగాహనా రాయిత్యంతో తప్పుగా మాట్లాడి ఉంటె. మీరన్నట్టు ఒకరి ఆలోచన పరిధి, లోతు ఎంతో, అంతే ఆలోచించగలరు అని. నా ఆలోచన లోతు, పరిధి ఇంతే ఏమో అన్న.
ఎందుకన్నా ఈ 24 సీట్స్, చంద్రబాబు గారి 2014 -2019 పరిపాలన వైఫల్యాన్ని మొయ్యడానికి తయారు అయ్యినందుకా , లేదా చంద్రబాబు మీద అవినీతి కేసులకు మీ విశ్వసనీయతతో అడ్డుకట్ట వేసినందుకా? లేదా టీడీపీ అనుకూల ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా లో మీ మీద2014 నుండి ఈ రోజు వరకు దుమ్మెత్తి పోస్తున్నందుకా ? 2019 -2024 మధ్యలో జనసేన బలంగా వైసీపీ/జగన్ మీద గట్టిగ వీధుల్లో పోరాడి ప్రభుత్వం మీద వ్యతిరేకత తెప్పించగలిగినందుకా ? ఇవన్నీ భరించి చేసినందుకు మన పార్టీకి ప్రయోజనం ఉండాలి కదన్న? ఈ 24 సీట్స్ ఆ త్యాగాలకు న్యాయం చేస్తాయా అన్న?
ఏమైనా అంటే రాష్ట్రం కోసం మనం త్యాగాలు చెయ్యాలంటావ్ , ఒప్పుకుంటాను , అదే మాట, బాధ్యత టీడీపీ కి కూడా ఉండాలి కదా ? మనం మామూలు త్యాగం కాదు, మన పార్టీ భవిష్యత్తునే త్యాగం చేస్తున్నాం. ఎందుకో, ఎలానో చెప్తాను.
మీరు ఎప్పుడు చెప్పే మార్పు కోసం ఈ 24 సీట్స్ తీసుకుంటున్నారా? నా దృష్టిలో మార్పు అంటే, మీరు చెప్పే బలమైన వాడికి చట్టం బలహీనంగా , బలహీనుడుకి బలంగా కాకుండా అందరికి సమానంగా పని చేయాలి అంటే. సుప్రీమ్ కోర్ట్ 2006 పోలీసు సంస్కరణలు తీర్పు ఉమ్మడి మానిఫెస్టోలో పెట్టి అమలు చెయ్యాలి , చంద్రబాబు గారు ఊదరకొట్టే సింగపూర్ మోడల్ అభివృద్ధి కావాలంటే బలమైన స్వతంత్ర అవినీతి వ్యతిరేక లోకాయుక్త చట్టం కావాలని ( ప్రతి ఒక్కడు వేల, లక్షల కోట్లు దోచుకున్నారు, దోచుకుంటున్నారు, భవిష్యత్తులో అయినా ఆపడానికి), స్థానిక మున్సిపాలిటీస్ , పంచాయతీలకు బలమైన చట్టం చేసి , బడ్జెట్లో 10 -15 % తప్పనిసరి ఇవ్వడంతో పాటు, వాటికి ఆర్థిక స్వతంత్ర ఇవ్వాలి అని మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తాం అని పట్టుపట్టి, జనసేనపార్టీ అప్పుడు రాష్ట్ర హితం కోసం త్యాగం చేస్తున్నాం అనుంటే వ్యవస్థలో మార్పుకోసం త్యాగం చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళం . మన పార్టీ కి ఒక బలమైన కథనం(plot ), ఎజెండా ఉండేది. ఒక వేల పొత్తులో టీడీపీ పార్టీ ఇవి అమలు చెయ్యకపోతే బయటికి వచ్చి ప్రజల్లోకి వెల్లడానికి వీలయ్యేది .
ఇప్పుడు 2014 -2019 లాగ మళ్ళీ మోసపోతే మనం ఏమని చెప్తాం ప్రజల్లోకి వెళ్లి. టీడీపీ ఆలా చెయ్యదని ఏమైనా గారంటీ అడిగారా అన్న, మన మద్దతుదారులని అడిగినట్టు శ్రీకాకుళం యువశక్తి సభలో లాగ ? అటువంటిది ఏమైనా ఉంటె నిలబెట్టుకుంటారని గారంటీ ఏంటన్న? ఏమి లేకుండానే ఒక దశాబ్టం పాటు ఈ పొత్తు బలంగా ఉండాలి అని ఎలా చెప్తారు అన్న.
ఈ 24 సీట్స్ తో 98 % స్ట్రైక్ రేట్ ఎక్కడైనా జరిగిందా అన్న? దీనికి గారంటీ ఉందన్నా మీ ప్రకారం? స్థానిక సంస్థల్లో మూడో వంతు ఎలా ఇస్తారన్నా? ఒకరు ఏంటి ఇచ్చేది, మేమె తీసుకుంటాం , తగ్గేది లేదు ఈ సారి అని మనం బీరాలు పలికి టీడీపీ మనకి 10 -12 % సీట్స్ ఇచ్చి సరిపెట్టారు .
2023 యువశక్తి సభలో 53 – 54 నియోజకవర్గాలు అని మాట్లాడి, చంద్రబాబు గారితో సీట్స్ గురించి అసలు చర్చించి ,ముందే ఒక అవగాహనాకి రాకుండా “వ్యతిరేక ఓట్లు చీలనివ్వను” అని, ఏకపక్ష పొత్తు ప్రకటనలు చేస్తే, పొత్తు చర్చల్లో మన పార్టీ హ్యాండ్ బలహీనం అవుతుంది అని తెలియదా అన్న ఇంత తత్వశాస్త్రం, ప్రపంచ చరిత్రలు చదివిన మీకు . అదీ కాకుండా మన రాష్ట్రంలో చంద్రబాబు గారికి ఘన కీర్తి కూడా ఉంది ఆయనతో భేరం మాములుగా ఉండదు అని. ఎలా అన్న ఇలాంటి అమాయక రాజకీయం చేస్తూ వ్యూహం నాకు వదిలేయండి అంటారు.
మీ గౌరవం తగ్గకుండా , మనం లొంగిపోకుండా, ఈ సారి తగ్గం, మనం భుజం-భుజం కలిసి పక్కన నడుస్తున్నాం, వెనకాల కాదు , అధికారంలో నిర్ణయాత్మక పాత్ర, దామాషా పద్ధతి అని చెప్పి 24 సీట్స్ తీసుకోవడం ఏంది అన్న. నిన్ను గుడ్డిగా నమ్మితే ఏమైంది అన్న ఇప్పుడు . మీరిచ్చిన భరోసా నిలబెట్టుకున్నారు అనుకుంటున్నారా ఈ 24 సీట్స్ తో ? ఎమన్నా అంటే మళ్ళీ గుడ్డిగా నన్ను నమ్మే వాడే నా వాడు అంటారు.
ఈ రోజు డబ్బు రాజకీయాల్లో స్థానిక ఎన్నికలల్లో మూడో వంతు డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తారా లేక రబ్బరు చెప్పులు వాళ్ళకి ఇస్తారా అన్న? ఇక్కడ కూడా డబ్బుతో ఎలక్షనీరింగ్ చెయ్యగలిగే వాళ్ళకే గెలుపు ఉంటది అన్నో. అదే మనకి మార్గం అయితే ఆ డబ్బు, పలుకుబడి రాజకీయం అదేదో 2019 లోనే చేసుండాలి లేదా 2024 లోనే చెయ్యాలి . 2029 కి మనం ఏమి కొత్తగా చెయ్యం కదన్నా. 2029 కి కూడా మీరు ఎలాగూ అవినీతి కాంట్రాక్టు లు తీసుకుని రాజకీయం చేసే రకం కూడా కాదు. 2024 లో మీ త్యాగంతో ప్రస్తుతం వైసీపీ మీద ఉన్న ప్రజా వ్యతిరేకతతో టీడీపీకి పూర్తి మెజారిటీ వస్తే మనకి ఎందుకు ప్రధాన మంత్రిత్వ శాఖలు(హోమ్ (with లా & ఆర్డర్), ఆర్థికం, రెవిన్యూ ) ఇవ్వడం కానీ, మన ఎదుగుదలకి తోడ్పడతారు అని ఎలా అనుకుంటాము అన్న. పెద్ద పార్టీ అధికారంలో ఉంటె చిన్న పార్టీ ఎదిగిన దాఖలాలు ఎక్కడ లేదు అన్న ఈ భారత దేశ చరిత్రలో . అది ఒక ఉద్యమ పార్టీ అయితే తప్ప.ఉద్యమ పార్టీకి ఉండే లక్సరీలు అందరికి ఉండదు కదన్నా. 2029లో కూడా మనకి కావాల్సిన చోట టీడీపీ సిట్టింగ్ ఎమ్మేల్యులు ఉంటె మనకి ఎలా ఇస్తారు అన్న ఆ సీట్స్ . దీనికి కూడా మీ దగ్గర ఏమైనా గారంటీ ఉంటె చెప్పు అన్న శ్రీకాకుళం సభలో అడిగినట్లు. పరిస్థితి ఇలా ఉంటె మనం చెప్పే మార్పు కానీ , మన పార్టీ ఎదగటం గాని ఎలా జరగతాది అన్న ఇంకా మరో రెండు దశాబ్దాలు అయినా.
అధికార పక్షంలో భాగంగా ఉండే 15 -20 ఎమ్మెల్యేలు ఏమి సాధించలేరు అన్న..వారేమి ప్రతిపక్షంలో ఉండి హీరో లాగా పోరాడి ప్రజలు మన్ననలు పొందడానికి . కాకపోతే కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోగలరు ఏమో అన్న. అధికార పక్షం ఉచితాలుకి పొగ ఏదైనా మిగిలే ఫండ్స్ ఇస్తే. అధికారం వచ్చిన తరువాత రాజకీయ పార్టీలు ఎలా ప్రవర్తిస్తాయో మిరే బాగా చెప్పారు. వాడుకొని వదిలేస్తారు అని. అది ప్రజాస్వామ్యంలో నంబర్స్ లేనిదే ఎవరు మనకి గౌరవం ఇవ్వరు . మన నంబర్స్ అధికార పక్షానికి ఉపయోగం లేదంటే అసలే విలువ ఇవ్వరు.
టీడీపీ తో రాజమండ్రి జైలు ముందు పొత్తు ప్రకటించిన తరువాత, పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ టీడీపీ డౌన్ అయ్యి బలహీనంగా ఉంది అని ఇప్ప్డుడు మనం అవకాశం తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నారు, వారి కాస్త కాలం లో ఆదుకోవాలి అన్నారు. మరి వారు 24 సీట్స్ తో మనల్ని బాగా గౌరవించారు అనుకుంటున్నారా అన్న? మీ దృష్టిలో జనసేన పార్టీ ఎప్పుడు ఎదగాలి? ఇలాంటి అవకాశాలని కూడా పార్టీ పురోగతికి వాడుకోకపోతే!!!. ఒక పక్క టీడీపీ బలంగా ఉంటూ జనసేన పార్టీ ఎదగాలి అంటే ఎలా జరుగుతుంది. మీరు కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు. ఆ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్లాక్ టీడీపీ దగ్గరే కదా ఉండేది. వాళ్ళు బలంగా ఉంటే మనం ఎలా ఎదుగుతాం. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అన్న.
2014 లో పార్టీ పెట్టి, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని ఎన్నికల బరిలో నెమ్మదిగా సత్తా చూపి ప్రజా సమస్యలు తీరుద్దాం అంటే కాదు మనం పోటీ చేయకుండా 2009లో ప్రజారాజ్యం వల్ల టీడీపీ ఏదో నష్ట పోయినట్టు మనం నిస్వార్థంగా సపోర్ట్ చేసాం రాష్ట్రము కోసం. నిజానికి ప్రజారాజ్యం వల్ల కాంగ్రెస్ ఓటు చీలి అసెంబ్లీలో టీడీపీ యే లాభపడింది . MLA & MP క్రాస్ వోటింగ్ యే సాక్ష్యం. సరే పోన్లే మీ విశాల హృదయాన్ని అర్థం చేసుకున్నాం, అభినందించాం విడిపోయిన రాష్ట్రం కోసం లే అని.
2014 తరవాత పార్టీ ని నిర్మించిన పాపాన పోలేదు. అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టడం తప్ప. ఎందుకంటే కావాలనే పార్టీ నిర్మాణం చెప్పలేదు నికార్సైన , రాటుదేలిన , కమిట్మెంట్ ఉన్న వాళ్ళతోనే పార్టీ నిర్మాణం చెయ్యాలి అని . ఇది ఎక్కడ ఉంది అన్న పార్టీ నిర్మాణం ఇలాగె చెయ్యాలి అని. 2017 లో బీజేపీ తో స్పెషల్ స్టేటస్ మీద విభేదించి దూరం జరిగాం. మంచిది . మాట మీద నిలబడ్డాం అనుకున్నాం. 2018 లో టీడీపీ పరిపాలన వైఫల్యం, అవినీతి, అభివృద్ధిలేమి పై పొత్తు నుండి బయటికి వచ్చి యుద్ధం చేసాం. కమ్యూనికేషన్ గ్యాప్ తో రావాల్సి వచ్చింది లేకపోతే ఆ పొత్తు అలాగే కొనసాగేది అని చెప్పారు ఈ మధ్య పొత్తులు పెట్టుకున్నప్పుడు. బాబు గారు అందుకే మా వాడు అని 2019 లో వెన్నుపోటు పొడిచారు.
సరే 2019 లో ఉన్నంత లో బలంగా పోరాటం చేసాం, కానీ పార్టీ నిర్మాణం మాత్రం లేదు అప్పటికి .కనీసం బూత్ కమిటీలు లేవు. ఎన్నికలు వచ్చాయి , స్టేట్ బ్యాంకు క్లర్కులు పోస్టుకి అప్లికేషన్ ఇచ్చినట్టు MLA టికెట్స్ ఇచ్చాము వేళ్ళ మీద లెక్కపెట్టే మెచ్చుకోదగ్గ కొంతమంది తప్ప. వాళ్ళకి క్యాంపైన్ చేసుకునే సమయం కూడా లేదు . అంత బాగా ప్రిపేర్ అయ్యాం 2019 ఎన్నికలకి . రబ్బరు చెప్పులు ఏసుకున్న వారితో రాజకీయం అన్నావ్, కాన్షిరాం ఆదర్శం అన్నావ్. బాగుంది. మంచిది. 2019 ఎన్నికలు వచ్చాయి. ఘోరంగా ఓడిపోయాం. కానీ నైతికంగా గట్టిగా పోరాడాం అని తృప్తి మిగిలింది.
నా లాంటి ఎందరో 2018 నుండి నీ పోరాటం చూసి ఆశ చిగురించింది మన ఆంధ్ర భవిత మారుతుంది అని. 2019 ఘోర ఓటమి మీ అభిమానుల్లో , పార్టీ మద్దతుదారుల్లోను, 2009 తరవాత రాజకీయంగా దూరంగా ఉన్న ఎన్నో కుటుంబాలలో ఒక సానుభూతి, బాధ, ఆవేదన కలిగింది. అరే మన కళ్యాణ్ని , చిరంజీవి గారి కుటుంబ సభ్యున్ని ఇలా ఒంటరి వాడ్ని చేసేసాము అని. ఆ బాధ, సానుభూతి మీ కోసం మెల్లగా ముందుకు వచ్చేలా చేసాయి. చూద్దాం గట్టిగ నిలబడితే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. మీరు అంతే గట్టిగా నిలబడ్డారు . మా లాంటి వాళ్ళకి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఘోర ఓటమి వస్తే ఏంటి, కళ్యాణ్ బలంగా నిలబడుతున్నారు , భవిష్యత్తు అంతా మనదే అనుకున్నాం. ఇంకేం మద్దతు ,సానుభూతి కూడా పెరగటం మొదలైంది.
ఇసుక కార్మికుల, రోడ్ల దుస్థితి నుండి కౌలు రైతుల వరకు అన్ని రాష్ట్ర సమస్యలు జనసేన పార్టీ మాత్రమే బలంగా లేవనెత్తారు. జగన్ మీద బలంగా , ధైర్యంగా పోరాటం చేసే సత్తా, నైతికత కేవలం జనసేన సొంతం అనే రీతిలో పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. దానితో పాటు 2020లో జాతీయ పార్టీ బీజేపీతో పొత్తులోకి వెళ్ళాం మన సిద్ధాంతానికి దగ్గరగా ఉండే ఏకైక జాతీయ పార్టీ అని. అన్ని మంచి శకునాలు.
ఎందుకు టీడీపీ తో పొత్తు అంటే 1) “జగన్ ను దించేయాలి” అంటారు, 2) “మీరు 2019 లో నన్ను ఓడించారు” అంటారు . ఒకర్ని ఎలాగైనా దించేయాలి అనే ద్వేషం అది ఎంత న్యాయమైన ప్రజాస్వామ్యం లో తటస్థ ఓటర్లు దాన్ని హర్షించరు. నాలాంటి కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతంతో ఉన్నవాళ్లు తప్ప. మనం ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళిక తో ప్రజల ఒప్పించగల్గాలి.
వైసీపీ అప్పులు చేసి ఉచితాలు తో బటన్ నొక్కుడు పాలనా చేస్తే, టీడీపీ 6 గారంటీస్ అని వైసీపీ కన్నా ఎక్కువ ఉచితాలు ఇస్తాము అని ప్రామిస్ చేస్తుంటే , మన అభివృద్ధి ప్రణాళిక ఒకటి రెండు తప్ప ,మిగతా అంతా పక్కన పెట్టి , టీడీపీ ఉచితాలు ఎజెండా మొయ్యాలి మనం.
సరే, వ్యవస్థల్ని జగన్ నాశనం చేస్తున్నాడు కాబట్టి దించేయాలి అనుకుందాం, కానీ మనం ఆ వ్యవస్థల్ని బాగు చేయడానికి నిర్మాణాత్మక మార్పులు ఏమైనా చెప్పామా? మేనిఫెస్టో లో వ్యవస్థల బాగు గురుంచి ఉందా? లేదే! మార్పు తెస్తాను అనడం తప్ప, నిర్దిష్టంగా ఏమి చేస్తామో చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు దించినా మళ్ళీ జగన్ లాంటోడు రాడని గారంటీ ఏంటన్న? వ్యవస్థల్ని శాశ్వత ప్రాతిపదికన సరిదిద్దే ఎజెండా , మేనిఫెస్టో ఇంతవరకు మాట వరకు కూడా ప్రస్తావన లేదు అన్న. అలాంటి వ్యవస్థల్ని శాశ్వతంగా బలపరిచే ఎజెండా ని కామన్ మేనిఫెస్టో లో చేర్చి, ఇవి రాష్ట్రాన్ని కాపాడుతాయి అని మద్దతు ఇచ్చి ఉంటె బాగుండేది అన్న. మనం సిద్ధాంతాలు , విధానాలు, రాజ్యాంగాలు గురుంచి ఆలోచించే పార్టీ కదన్న. మనం పార్టీ పెట్టింది , ఇక్కడ ఉండి, పోరాటం చేసేది అలాంటి మార్పు కోసమే కదన్న.
మనకు ఊపు వచ్చిన ప్రతిసారి వేరే ప్రతిపక్షం బలహీనం గా ఉన్న సమయం లో ఒక దాని తరువాత ఒకటిగా తప్పులు జరిగాయి. 2022 మార్చ్ 14న ప్రతిపక్షం ఓటు చీలనివ్వను అన్నారు . చాలా మంది విమర్శించారు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే పరోక్ష పొత్తు ప్రకటన చెయ్యడం ఏంటి అని. మీరు దీన్ని వెనక్కి తీసుకుంటారు లేదా మార్చుకొంటారు అనే ఆశ కూడా లేదు ఎందుకంటే మీరు KCR లేదా చంద్రబాబు లాగా మాట మార్చే రకం కాదు కాబట్టి. మాలో ఎక్కడో ఒక ఆశ, నమ్మకం మీరు అన్ని అలోచించి , గట్టి మాట తీసుకొని పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేసుంటారు అని. అదే టైం లో మనం ఇప్పటికే బీజేపీ తో పొత్తులో ఉన్నాం. పొత్తులో ఉన్న పార్టీకి చెప్పలేదు, కనీసం వాళ్ళ అభిప్రాయాలూ కూడా తీసుకోలేదు అని తరువాత అర్థం అయ్యింది.
పొత్తులో ఉండే బీజేపీ పార్టీని పక్కన పెడితే, జనసైనికుల అభిప్రాయాలూ గాని , జనసేన నాయకుల సెంటిమెంట్ గాని తీసుకోలేదు. దీనికి మీరు చెప్పే కారణం , మీరు లోకల్ బాడీ ఎన్నికలలో జనసేన కొన్ని ప్రాంతాలలో టీడీపీతో కలిసి వైసీపీ మీద పోరాటం చేస్తూ సమన్వయము చేసుకున్నారు అని. ఇది దేశం మొత్తంలో దాదాపు అన్ని పార్టీలు స్థానికంగా చాల కొద్దీ పరిమిత స్థాయిలో ఇలానే ఉంటాయి. ఆఖరికి కొన్ని ప్రాంతాల్లో బద్ద శత్రుత్వం ఉన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చుకుంటారు స్థానిక కారణాలతో . అంత మాత్రాన రాష్ట్ర స్థాయిలో ఏకపక్షంగా పొత్తులు చేసుకోవాలి అనుకోవడం అమాయకత్వం. ఆత్మహత్య సదృశ్యం పార్టీ కి క్లియర్ పొలిటికల్ మైలేజీ లేకుండా.
మార్చ్-14 ఇప్పటం సభలో వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న ప్రభావం , మన పార్టీలోకి రావాలనుకున్న చాల మందికి అడ్డుకట్ట వేసింది. పార్టీ వృద్ధి ఆగిపోయింది . ఆ సమయం లో టీడీపీ కనీసం బయటికి వచ్చే పరిస్థితి లేదు. చాల మంది మన పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ఏ ఇంచార్జిని అడిగిన ఇదే చెప్తారు. కొన్ని ప్రాంతాలలో స్థానిక ఎన్నికలలో టీడీపీ జనసేన సహకరించుకున్న అంశం “ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను” అనే మీ నిర్ణయానికి కారణం అయితే, పార్టీలో అందరు ఇలాంటి ఏకపక్ష పొత్తుకు వ్యతిరేకం అనే సెంటిమెంట్ని గుర్తించలేక పోయారా? అంతగా పార్టీలో మీరు కింద స్థాయి నాయకులకి, వారి ఆలోచనలకి దూరం అయ్యారా?
మీ అభిమానులు వైసీపీలలో , ఇంకో స్వార్థ రాజకియ పార్టీలో లాగ ఒక సారా ప్యాకెట్ కో , బిర్యానీ కో అమ్ముడుపోయే గుడ్డిగా ఫాలో అయ్యే సమూహం కాదు అన్న. ఇది వివేకానందుడి స్ఫూర్తి , మీలాంటి వాళ్ళ స్ఫూర్తి తో అవగాహనా కలిగిన చదుకున్న యువత అన్న .ప్రశ్నించండం వాళ్ళ నైజం. నేను తప్పు చేస్తే నన్ను ప్రశ్నించండి అని మిరే చెప్పారు. కానీ ప్రజస్వామ్యంలో మద్దతరులని పబ్లిక్ గా వాళ్ళ పాత రాజకీయ నిర్ణయాలను(వేరే పార్టీకి వోట్ వెయ్యడాన్ని) అవమానించి , గారంటీ అడిగిన తొలి రాజకీయ నాయకుడివి మిరే అన్న. . రాజకీయ ఉద్యమాలు గారంటీ తో రావని తెలియావా అన్న మీకు? ఒంటరిగా వెళ్లి వీర మరణాలు అంటావు, ఒంటరిగా దూకేసాను, రక్తాలు వచ్చాయి అంటావు కారణాలు అన్ని మనమే కదన్న, పరీక్షకి బాగా ప్రిపేర్ కాకుండా పరీక్షా రాసి , జనాలు మోసం చేసారు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అన్న. మార్పు అని 2009లో వస్తే అదే 72 లక్షల జనం కూడా నమ్మి మోస పోయారు కదా అన్న, వాళ్ళ అపనమ్మకమే 2019 ఫలితం అనుకోవచ్చు కదన్న . ఇలాంటి బలహీన కారణాలతో మరోసారి నమ్ముతున్న నీ పోరాటాన్ని సమర్థించే ఇంకొక అవకాశం ప్రజలకి ఇవ్వకుండా , ఇంకో రాజకీయ పార్టీ తో 24 సీట్స్ కోసం పొత్తు పెట్టుకోవడం కోసం కారణంగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అన్న.
జనాలని కులం, మతం, ప్రాంతం చూడకుండా ఓట్ వెయ్యాలంటావ్. మళ్ళీ నువ్వే చెప్తావ్ కులాలు , మతాలు మన సమాజంలో వాస్తవం వాటి నుంచి మనం పారిపోలేం. కాకపోతే కుల, మాత ద్వేషాలు లేకుండా సామరస్యంగా ఉండాలి అంటావ్, కొన్ని వందల సంవత్సరాల రాజకీయ ప్రపంచ చరిత్ర అయినా, లేదంటే భారత దేశ చరిత్ర అయినా , వర్తమానంలో అయినా వీటి ప్రస్తావన లేకుండా భారత, రాష్ట్ర రాజకీయాలు లేదు అని తెలియాదా అన్న ఇంత అధ్యనం చేసారు సమాజాన్ని. దానికి కూడా మద్దతుదారులనే నిందిస్తావా అన్న కులం చూసి ఓట్లు వేస్తున్నారు అని . రాజకీయాలు చేస్తున్నారా , ఫిలాసఫీ చెప్తున్నారా అన్న? మద్దతుదారులని నేను నమ్మను అనడం ఏంది అన్న స్టేజి మీద, ఇది ఎలాంటి రాజకీయం అన్న.
ప్రజలు ఎప్పుడు తప్పు చెయ్యరు అన్న. ఆ రోజు ఉండే దేశ, కాల, మాన పరిస్థితులు తగ్గట్టు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అన్న.2019 లో మనం అధికార టీడీపీ, చంద్రబాబు గారి వైఫల్యాలను ఎండగట్టామ్ , మనం సరైన గట్టి నియోజకవర్గ పోటీదారులతో నిలబడలేదు అని, పవన్ మా వాడే అని బాబు గారి వెన్నుపోటు రాజకీయాల వల్ల, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి వెళ్ళింది. తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే మోకాళ్ళ మీద కూర్చోవాలి అన్న మీ ద్యేయం నెరవేరింది కదా అన్న. కాకపోతే మనం అందుకు పూర్తిగా సంసిద్ధంగా లేము ఆ రోజు అని మిరే ఒప్పుకున్నారు అన్న. ఇప్పుడు చేసింది కరెక్ట్ యే కదా అన్న. మీరన్నట్టు పేద ప్రజలు ఆశావహులు ఇస్తామంటే ఆశపడుతారు, భయపెడితే భయపడతారు. ఇలాంటి వాటి నుండి పాటలు నేర్చుకొని ముందుకు పోవాలి గాని ప్రజలని, మద్దతుదారులు నిందిస్తే ఉపయోగం ఏముంది అన్న.
జగన్ బాగా పాలిస్తే జనసేన కి ఎదిగే అవకాశం ఎక్కడి నుండి వస్తాది అన్న. మీరు ఎప్పుడు చెప్పే ఉద్యమం ప్రజల నుంచి రావాలి మనం పురుడు మాత్రమే పోయగలం అంటావు కదా అన్న. ప్రజా ఉద్యమం జగన్ లాంటి దుర్మార్గపు పరిపాలనలో నే కదా అన్న వచ్చేది. దానిని పూర్తిగా రానిచ్చి మనం మాత్రమే ప్రత్యామ్నాయం అని ప్రజల దగ్గర పోతేనే కదన్నా నువ్వనే ఆ ఉద్యమానికి పురుడు పోసి మార్పు తెచ్చేది మనం . ఆ ప్రజా ఉదయం వచ్చే సమయం లో మరొక్క అవకాశవాద, విఫల రాజకీయ పార్టీ నాయకుడుతో కలిసి పోతే, ప్రజలు మనల్ని ఎందుకు నమ్ముతారు, నమ్మి మన వెనక ఎలా నడుస్తారు అన్న. ఈ 24 లో మనం ఏమైనా విజయం సాధించకపోతే మళ్ళీ మద్దతుదారులని , ప్రజలని నిందించకండి అన్న. వాళ్ళ అసలు అడియాసలు అయ్యాయి అప్పుడే.
పదే పదే మీ మద్దతా దారుల భావోద్వేగాలు మీద దెబ్బ కొట్టి , మళ్ళీ అదే మద్దతరులని నిందించడం ఎంత వరకు కరెక్ట్ అన్న. బీజేపీ పార్టీ ఎన్నో ఓటమిలను చూసింది , నాకు తెలిసి మద్దతా దారులని ఎప్పుడు నిందించలేదు అన్న. మీకు చాలామంది చెప్పారనుకుంటున్న 2009 తరవాత పార్టీ ని నిలబెట్టుకోలేదు , దాని వాళ్ళ చాల మందికి మళ్ళీ నమ్మకం కలగటానికి సమయం పడుతుంది అని మీకు కూడా తెలుసు. అది మనకు కొంతవరకు 2019 ఎన్నికలలో ప్రభావం చూపింది , మన పార్టీ నిర్మాణం లేమి తో పాటు, రబ్బరు చెప్పుల రాజకీయాలు అని. రబ్బరు చెప్పులు ఏసుకున్న వారితో రాజకీయాలు రాత్రికి రాత్రి సాధ్యపడదు అని తెలియాదా అన్న మీరు ఈ సమాజాన్ని మాకన్నా బాగా అర్థం చేసుకున్న వారుగా ? అలాంటప్పుడు ఓపిక ఉండాలి లేదా అందరు చేసే రాజకీయాలు చేయాలి కదన్న . ఆటు ఆడతా ,ఇటు ఆడతా అంటే ఎలా అన్న.
అవినీతిపై రాజీలేని పోరాటం అని పార్టీ మూల సిద్ధాంతంలో పెట్టి ఆఖరికి ఆమోదయోగ్యమైన అవినీతి(Acceptable Corruption ) స్టేజికి ఎలా వచ్చాము అన్న . సాక్షాత్తు కొత్త తరంలో స్ఫూర్తి రగిలంచడానికి వచ్చి పార్టీ ప్రెసిడెంట్ గా మీ స్థాయి ప్రభావం ఉండే నాయకులూ ఇలాంటి మాటలు మాట్లాడితే దాని ఫలితం ఆలోచించారా అన్న? లేకపోతే అవినీతి ఆరోపణలు మీద జైలుకి వెళ్లిన చంద్రబాబు గారి వల్ల , టీడీపీ తో పొత్తుకు మద్దతు కూడగట్టడానికి ఇలాంటి మాటలు చెప్పారా అన్న.
మీరు మాట్లాడే మాటలకి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా అన్న? లేకుంటే నేను మాట్లాడే మాటలు లేదా చేసే పనులు అన్ని కరెక్ట్ ఏ, నన్ను నమ్మి నా మాటలు నా చేతలు గుడ్డిగా ఒప్పుకుంటేనే నా వాడు అంటారా? నా పార్టీ, నా కష్టార్జితం తో పెట్టాను నన్ను అడిగే అర్హత ఎవరికీ లేదంటారా?
ఒక వ్యక్తితో కూడిన ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు , అది డబ్బు, మీడియా , వనరులు ఏమి లేకుండా పెట్టినప్పుడు అది ఎదుగుతున్న సమయంలో అన్ని మిరే చూసుకోవాలి కదా. ఇక్కడ నేను 2009 లో మీరు చెప్పిన డబ్బు కన్నా సమయం ఇవ్వడం రాజకీయం లో ముఖ్యం అన్న మీ మాట మీమరొక్క సారి గుర్తు చేస్తున్నాను. కాదు నాకు సమయం లేదు అంటే కష్టం కదా. పార్టీలో కింద స్థాయి నాయకులూ అందరు మీకే చెప్పాలనుకుంటారు. మీరు వింటే వారికి భరోసా . కారణం మిగిలిన వారు మీ అంత నమ్మకం స్ఫూర్తి ఇవ్వలేరు కనుక. మనది ఇంకా ఒక వ్యక్తి ఆధారిత పార్టీ కనుక. చాలా పార్టీలలో నెంబర్ 2 కేటగిరీలో ఒక్కరే ఉండరు అన్న. కనీసం ముగ్గురు ,నలుగురు ఉంటారు అన్న. ఒకరు ద్వారా సౌకర్యం లేకపోతే ఇంకొకరు ద్వారా మీకు చెప్పుకోవడానికి లేదా సమస్యలు తీర్చడానికి. ఇక్కడ ఏంటో అంతా ఒక్కరే దిక్కు అన్న. ఏ సంస్థలో ఐన ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించే వ్యక్తులకి ప్రత్యామ్నాయం/బ్యాకప్ ఉండేలా చూస్తారు. అది వ్యక్తులమీద నమ్మకం లేక కాదు, ఒకరి వైఫల్యం వలన సంస్థ, దానిమీద ఆధారపడ్డ లక్షల మంది నష్టపోకుండా ఉండేందుకు.
మీరు హైదరాబాద్ నుండి పోరాటంతో బయలు దేరి వెళ్లి రాజమండ్రి జైలు దగ్గర చంద్రబాబు గారికి మద్దతు పలకాల్సిన అవసరం ఏంటి అన్న? మనకి ఇచ్చిన ముష్టి గౌరవప్రదమైన 24 సీట్స్ కోసమా అన్న? ఇక్కడ కూడా ఇప్పటం సభ లాగే పునరావృతం. మనకి గట్టి మాట, వాగ్దానం లేకుండా ఏకపక్షంగా పొత్తు ప్రకటించేసారు . మేము ఇక్కడ కూడా నమ్మాము మిమ్మల్ని ఏదో ఒక బలమైన వ్యూహం ఉంది అని . కట్ చేస్తే మనకి ముష్టి 24 సీట్స్.
ఇట్లు
కన్నీటితో మిమ్మల్ని సదా అభిమానించే మీ శ్రీయోభిలాషిని
Raj Pattem గారు తన ఆవేదన ఇలా వ్యక్తపరిచారు