Site icon Telangana Voice News

మేడిగడ్డ – ఒక తెగిన వీణ

Medigadda Telangana

ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, వందలాది మీడియా ప్రతినిధులు, – ఎంతమంది ఉన్నప్పటికీ నిన్న మేడిగడ్డ సందర్శించినప్పుడు ఒక వంటరితనం ఫీలయ్యాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లర్లను ఇతర పరిసరాలను మొత్తంగా బ్యారేజీని పరిశీలించి తర్వాత ప్రజా ప్రతినిధులకు, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ వద్ద మాట్లాడారు. ఐనప్పటికే ఒకింత అలజడి, ఆందోళనగానే అనిపించింది. ఎదో శరీరంలోంచి తెగిపడ్డ భావన.

చాలా ఏండ్ల క్రితం పోలీసు ఎన్కౌంటర్ లో మరణించిన నక్సలైట్ల శవాలను తెచ్చుకునేటప్పుడు, మార్చురీ దగ్గర పౌర హక్కుల సంఘం మిత్రులం వెయిట్ చేసినప్పుడు అనుభవించినటువంటి వెలితి ఎదో మనసును ఆవరించింది. ఆ వెలితి, విషాదం, నిస్సహాయతా, ఆగ్రహం, అన్నీ గలసిన వైరాగ్య భావం మళ్ళీ ఇక్కడ ఫీలయ్యాను.

నిజానికి విజిలెన్స్ కమిషన్ డైరెక్టర్ గానీ అంతకుముందు ఇంజనీర్ ఇన్ చీఫ్ గానీ ఆ ప్రజెంటేషన్ ఇస్తూ మేడిగడ్డ గురించి వెల్లడించిన వాస్తవాలు వినక ముందే ఒక నిర్లిప్తత ఆవరించింది. విన్నాక మరింత నిస్సత్తువ ఆవరించింది.

తెచ్చుకున్న తెలంగాణలో ఇంత ఘోరం ఒకేసారి చూసేటప్పటికి ఒక స్మశాన నిశబ్ధం ఎదో రక్తనాళాల్లోకి పాకిపోయి అచేతనుడిని చేసింది. ఇది నాకేనా లేక మిగతా వారికి కూడానా అని చూస్తే చాలా మంది ముభావంగా ఉండిపోయారు.

ఆ వరస పిల్లర్లు చూస్తుంటే, సమాధులు యాదికి వచ్చాయి. అందులో కుంగిపోయిన రెండు పిల్లర్ల వద్ద అందరం గుమిగూడాం. ఎవరికి తోచినట్టు వారు లైవ్ ఇస్తూ రిపోర్టింగ్ చేస్తూ ఉంటే ఫలానా మనిషి ఎలా పోయాడో ఒకరికొకరు చెప్పుకునే జానపదుల్లా కళతప్పి కనిపించారు.

నాకైతే మేడిగడ్డ చూస్తే, త్యాగాల బాటలో ఒరిగిన ఒక అజానుబాహువు వంటి అమరుడిని చూసినప్పటి భావన కలిగి మనసంత చేదు అయింది. అది హత్యనా ఆత్మహత్యనా నిజంగానే ఎన్ కౌంటరా పోల్చుకోలేని స్థితి ఉంటంది చూశారా? అలాంటి అచేతన భావన. దీనికి ఎవరినీ నిందించలేని స్థితి ఒకటుంటుంది చూశారా అలాంటి ద్వైదీ భావన.

బహుశా మళ్ళీ తెచ్చుకోలేని ప్రాణం లాగా…ఎన్నో కలలు, ఆశలు పెట్టుకున్న ‘కాళేశ్వరం’…మలిదశ తెలంగాణా ఉద్యమానంతరం, స్వరాష్ట్రంలో ఒక పెద్ద భరోసాగా అనిపించేది. నీళ్ళే కదా తెలంగాణకు ప్రాణం. ఈ ఒక్క ప్రాజెక్టు దశాబ్దాల వేదనను తొలగించే నిరంతర చెలిమ అవుతుందని ఆశించాం. కానీ ఆ క్షేత్రంలోకి వచ్చి చూస్తున్నపుడు కాళేశ్వరం శిరస్సు లేదా హృదయం అనదగ్గ మేడిగడ్డ మొదలు తెగిపడ్డట్టు అనిపించింది. ఇంటికి పెద్ద దిక్కులా ఉండే మనిషిని నిర్దయగా ఎవరో బలి తీసుకున్నట్టు అనిపించింది. ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్నాను.

ఎవరి స్వార్థమో చెప్పడం అక్కరలేదు. ఎవరిని దోషులుగా పెర్కొనాలీ అన్నది కూడా అనవసరం. అందరం అన్నదమ్ములే. సోదరులమే.

ఇదిమిద్దంగా వైఫల్యానికి ఎవరిని బాధ్యులు చేయడం అన్న విషయం కన్నా ఒక భూమి పుత్రుడిగా సొంత ఇల్లు కూలిపొయినట్లాంటి బాధ. మంచినీళ్ళ బావిలోకి ఎవరో దుంకి ఆత్మహత చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ నీళ్ళు పనికిరావు, ఆ బావి ఎలాంటి జ్ఞాపకాలు మిగులుస్తుంది. అటువంటిదేదో భరింపరాని భాదకు, చెప్పరాని మనోవేదనకు గురి చేసింది ఈ పర్యటన.

రేపెమిటో అన్నది తెలియని స్థితి కూడా కావొచ్చు, ఇంతటి భీతివాహ అనుభవానికి, శూన్యతకు కారణం.

అవినీతి, అలసత్వం కాదు…లెక్కలు, పత్రాలు, మ్యాపులూ కాదు. దర్యాప్తులు, సంజాయిషీలూ కాదు. రిపేర్లు, అప్పులూ కూడా కాదు. ఎవరు నిన్నటి లేదా ఇవాల్టి ముఖ్యమంత్రీ అన్నదీ కాదు. వాటన్నిటికన్నా ముందు ఒక అవిశ్వాసం. మనపై మనకే నమ్మక రాహిత్యం అన్నది ఎదో మూలమట్టం నుంచి బలహీనం చేస్తున్నది. ఒక వ్యాకులత అంతటా వ్యాపిస్తున్నది.

బయటకు వ్యక్తం కాని దు:ఖం లోలోన బాధపెడుతుంటే తల్లడమల్లడమవుతూ ఈ నాలుగు మాటలు. కొంచెం ఉపశమనం కోసం.

Exit mobile version