త్రిబుల్‌ ఆర్‌ పనులను వేగవంతం చేయాలి : అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఫ్యూచర్‌ సిటీ వరకు హైదరాబాద్‌ మెట్రో సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్నతాధికారులతో మెట్రో విస్తరణపై సీఎం సమీక్షించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

ఎయిర్‌ పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీలోని యంగ్‌ ఇండియా స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ వరకు 40 కి.మీమేర మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దాదాపు 30వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్‌ఖాన్‌పేట్‌ వరకు పొడిగించాలని సూచించారు. అందుకవసరమయ్యే అంచనాలతో డీపీఆర్‌ తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు.

హెచ్‌ఎండీఏ, ఎఫ్‌ఎస్‌డీఏ (ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ) సంయుక్తంగా ఈ మెట్రో రూట్‌ విస్తరణ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో భాగంగా మొత్తం 76.4 కి.మీ విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిందని తెలిపారు.

కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్‌ వెంచర్‌గా ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసిందని గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలనీ, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులనూ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సమీపంలోనే భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా డ్రైపోర్ట్‌ నిర్మాణానికి రూపకల్పన చేయాలని సూచించారు. హైదరాబాద్‌-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *