Dr Thutupalli Ravikumar for Telangana graduate MLC elections

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో డాక్టర్ తూతుపల్లి రవికుమార్? కమలం క్యాంపులో పెరుగుతున్న పొలిటికల్ హీట్

తెలంగాణలో 2027 మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడే అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో కమలం జెండా ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత డాక్టర్ తూతుపల్లి రవికుమార్ పేరు అభ్యర్థిత్వ రేసులో ప్రముఖంగా వినిపిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

విద్యార్థి ఉద్యమాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు..
సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన డాక్టర్ తూతుపల్లి రవికుమార్ 1990లో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) కార్యకర్తగా తన ప్రజా జీవితానికి పునాది వేశారు. 2001 నుంచి 2010 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేస్తూ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేవైఎం (BJYM) రాష్ట్ర కార్యదర్శిగా పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల సాధన కోసం కృషి చేశారు. మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన, ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, సూర్యాపేట జిల్లా ఇన్‌ఛార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీకి, సంఘ్‌కు దశాబ్దాలుగా అందించిన నిస్వార్థ సేవలను గుర్తించి ఈసారి ఆయనకే పట్టభద్రుల టికెట్ కేటాయించాలని క్యాడర్, యువ శ్రేణులు కోరుతున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

బీసీ ఓటు బ్యాంకుపై కమలం వ్యూహం
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు మరింత చేరువయ్యే వ్యూహంలో భాగంగా, ఈసారి పట్టభద్రుల బరిలో బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర కులగణన గణాంకాల ప్రకారం ముదిరాజ్ సామాజిక వర్గం రాష్ట్ర జనాభాలో 7.4 శాతం (సుమారు 26.39 లక్షలు) ఉండగా, ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఈ వర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్‌ను బరిలోకి దించడం ద్వారా ఆయా జిల్లాల పట్టభద్రుల్లో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెరవెనుక ఏం జరుగుతోంది? రేసులో ఇంకా ఎవరెవరు?
బీజేపీ టికెట్ కోసం మొత్తం 16 మంది ఆశావహులు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రవికుమార్‌తో పాటు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ వన్నాల వెంకటరమణ, ఇటీవల పీఆర్టీయూ (PRTU) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సుంకరి భిక్షం గౌడ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే, ఇటీవల బిక్షం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఆయన అభ్యర్థిత్వానికి కొంత మైనస్‌గా మారిందనే చర్చ కమలం క్యాంపులో నడుస్తోంది. మరోవైపు, ఇదే స్థానానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని, జనసేన పార్టీ డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థులుగా ప్రకటించగా, బీఆర్‌ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.

తదుపరి పరిణామాలు
ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించడంతో బీజేపీ అధిష్ఠానం కూడా అభ్యర్థి ఖరారుపై కసరత్తు వేగవంతం చేసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల సామాజిక సమీకరణాలు, విద్యావంతుల ఆకాంక్షలను బేరీజు వేసుకుంటూ పార్టీ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది త్వరలోనే తేలనుంది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *