ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (World Mental Health Day). ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన నిర్వహిస్తారు. ఈ రోజును మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి మరియు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మద్దత్తు తెలపడానికి జరుపుకుంటారు.
పరిచయం
మానసిక ఆరోగ్యం అనేది మన ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తనలను నియంత్రిస్తుంది. ఇది మన మొత్తం ఆరోగ్యం మరియు సంరక్షణకు చాలా ముఖ్యమైనది. మంచి మానసిక ఆరోగ్యం మనం మన జీవితాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించడానికి మరియు మన సామర్థ్యాలకు అనుగుణంగా పని చేయడానికి సహాయపడుతుంది.
అయితే, చాలా మంది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలు తేలికపాటి నుండి తీవ్రమైనవి వరకు ఉంటాయి. అవి మనదైనందిక జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు.
మానసిక ఆరోగ్య సమస్యలకు సాధారణ లక్షణాలు:
- బాధ లేదా విచారంగా అనిపించడం
- ఆనందించలేకపోవడం
- నిద్ర సమస్యలు
- శక్తి లేకపోవడం
- ఆందోళన
- ఏకాగ్రత లేకపోవడం
- నిర్ణయాలు తీసుకోలేకపోవడం
- బాధ్యతలను నిర్వహించలేకపోవడం
మానసిక ఆరోగ్యానికి కొన్ని సూచనలు.
గర్భం రావటానికి ముందు
గర్భం రావటానికి ముందు తల్లి ఆరోగ్యంగా ఉండాలి, గర్భంతో ఉన్నపుడు ఒత్తిడి ఉండకూడదు, ప్రసవం సుఖంగా జరగాలి, ప్రసవానంతరం బిడ్డ లాలన సాఫీగా జరిగి తల్లికి బిడ్డకి మంచి అనుబంధం ఏర్పడాలి. ఇది ఒక వ్యక్తి తదుపరి జీవిత మానసిక ఆరోగ్యానికి పునాది. ఈ పునాది లేనిదే తరువాత ఎంత చేసినా నిలకడ కష్టం.
పెరిగే పిల్లలకి సరైన
పెరిగే పిల్లలకి సరైన ఆహారం, మంచి నిద్ర, ఎక్కువ ఆటలు, ప్రేరణ, మార్గదర్శకత్వం, అవకాశాలు మొదలైనవి మెండుగా ఉండాలి. ఇవి భవిష్యత్తులో ఒడిదుడుకులని తట్టుకుని నిలబడే సత్తానిస్తాయి.
కౌమారంలో
కౌమారంలో ఉన్నవాళ్ళతో స్నేహపూర్వకముగా మెలగాలి. పాజిటివ్ రిస్క్ టేకింగ్ ని ప్రోత్సహించాలి. రకరకాల మానవ సంబంధాల్ని ప్రయత్నించి వాటిలో సాధకబాధకాలు తెలుసుకునే విధంగా తోడ్పడాలి. స్వంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వాలి.
యుక్తవయసులో
యుక్తవయసులో ఉన్నవాళ్లు వ్యసనాల జోలికి పోకుండా, లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించేందుకు శ్రమించాలి. దీనికోసం స్నేహితులు అవసరం. కొత్త మెళకువలు నేర్చుకునేందుకు ఉత్సాహం చూపాలి.
పెళ్ళైన వాళ్ళు
పెళ్ళైన వాళ్ళు, పొరపచ్చాలు సహజం అని గుర్తించాలి. బాధ్యతలు సమానంగా పంచుకోవాలి. పట్టు విడుపులుండాలి. అవతలివారికోసం కొన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. పిల్లల పెంపకంలో శిక్షణ తీసుకుంటే మంచిది. డబ్బు ఆదా చెయ్యాలి. పనిని దైవంగా భావించి చెయ్యాలి. పనికి వ్యక్తిగత జీవితానికి మధ్య సంయమనం ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం తప్పనిసరి. కుటుంబానికి బయటకూడా స్నేహసంబంధాలని కలిగి ఉండాలి. జ్ఞాపకాలు పోగుచేసుకోవాలి.
పెళ్ళైన పిల్లలున్నవాళ్ళు
పెళ్ళైన పిల్లలున్నవాళ్ళు, పిల్లలకి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. మధ్యలో దూరి వాళ్ళ, మీ మానసిక ఆరోగ్యం పాడుచేసుకోకూడదు. మనవాళ్ళని ఆడించాలి, కథలు చెప్పాలి. మీ వయసువారితో ఇష్టాగోష్టిలో ఉండాలి. సామజిక సేవ లేదా ఆధ్యాత్మిక కారక్రమాల్లో పాల్గొనాలి. తరచుగా వైద్యుల్ని కలిసి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
వృద్ధాప్యంలో
వృద్ధాప్యంలో పదవీవిరమణ తర్వాత ఏం చేయాలన్నది ముందే ఒక ప్రణాళిక రాసుకోవాలి. వీలునామా రాయించి ఉంచుకోవాలి. జీవితభాగస్వామిని జీవితానికి అర్ధం వెతుక్కోవాలి. వీలైనంత వ్యాయామం చెయ్యాలి. ఇంకా ఎన్నో.
సారాంశం
- తినండి- పాలు, పళ్ళు, ఆకుకూరలు, చేప, పప్పు, గుడ్లు, కొంచెం అన్నం.
- చెయ్యండి – స్నేహం, వ్యాయామం
- మానండి – జూదం, మద్యం, ధూమపానం