Bodhan Ex MLA Son in Road Accident Case

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది

పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్‌ సర్క్యులర్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. మరో రోడ్డుప్రమాద ఘటనలో అతడి ప్రమేయముందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగదోడుతున్నారు.

జూబ్లీహిల్స్‌లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్‌ వైపు వచ్చిన మహింద్రా థార్‌ వాహనం రాత్రి 8 గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు.

కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటంతో షకీల్‌ వాహనంగా తేలింది. అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్‌ ప్రకటన ఇచ్చారు.

మరోవైపు అఫ్రాన్‌ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.

బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్‌ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్‌ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది.

ఇటీవలే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రాహిల్‌ చేసిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పాత కేసుపై డీసీపీ విజయ్‌ కుమార్‌ దృష్టి సారించారు. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు.

మహారాష్ట్రకు వెళ్లి బాధితురాళ్లను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్‌సీట్‌ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితురాళ్లు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.దీన్నిబట్టి రాహిల్‌ డ్రైవింగ్‌ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు.

అతన్ని తప్పించే ప్రయత్నంలో ఒకరిద్దరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజా భవన్‌ వద్ద రోడ్డు ప్రమాద కేసులో నిందితులకు సహకరించినందుకు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. తాజా దర్యాప్తులో మరేవరైనా అధికారులు తేలే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.


Posted

in

, ,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *