ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. అందరినీ దోచుకోవాలని ప్లాన్ చేస్తున్న ఈ మోసగాళ్లు ఇటీవల కరీంనగర్ కు చెందిన ఒక యువకుడిని బెదిరించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు.
సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేర్లను ఉపయోగించి కుట్ర పన్నిన సైబర్ నేరగాళ్లు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరును కూడా ప్రస్తావించడం సంచలనంగా మారింది.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ కు చెందిన చిలువేరు శ్రీకాంత్ అనే యువకుడు.. కరీంనగర్ లో గాయకుడు, ప్రైవేట్ ఈవెంట్ నిర్వాహకుడు. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ కు ఈరోజు (ఏప్రిల్ 20) మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వీడియో కాల్ వచ్చింది.
ఆ కాల్ లో, మరొక వ్యక్తి శ్రీకాంత్ మనీలాండరింగ్ కు పాల్పడ్డాడని, వారు చెప్పినది వినకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని బెదిరించాడు. సైబర్ నేరగాళ్లు శ్రీకాంత్ ఆధార్ కార్డ్ నంబర్ ఉపయోగించి సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేర్లతో నకిలీ లేఖలు సృష్టించారు. అంతేకాకుండా, మహారాష్ట్ర పోలీస్ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరుతో ఒక లేఖను కూడా పంపారు.
ఆ తర్వాత దాదాపు రెండు గంటల పాటు శ్రీకాంత్‌కు తరచుగా వీడియో కాల్స్ చేసి భయభ్రాంతులకు గురిచేశారు. చివరికి డబ్బు ఇస్తే వదిలేస్తామని సైబర్ నేరస్థులు డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యాయని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే చర్య తీసుకున్నారు.
సైబర్ అరెస్ట్ పేరుతో బెదిరించి లక్షల రూపాయలు సంపాదించాలని ప్లాన్ చేసిన సైబర్ నేరస్థుల నుండి తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులను సంప్రదించి ఈ సంఘటనపై ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరస్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సైబర్ నేరస్థులు ఇలాంటి డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోతున్నారు.. సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, సైబర్ నేరస్థులు వెనక్కి తగ్గకుండా తమ పంజా విప్పుతూనే ఉన్నారు.
Leave a Reply